ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ప్రతి ఏటా ఏడు నుంచి పది లక్షల మంది దోమల వల్ల చనిపోతున్నారు. దోమల నివారణకు ప్రస్తుతం వాడుతున్న తెరలు, పురుగు మందులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా పురుగు మందుల వాడకం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దోమలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు శాస్త్రవేత్తలు అత్యాధునిక సాంకేతికతపై దృష్టి పెట్టారు.

ఫ్రెంచ్ స్టార్టప్ టోర్నియోల్ 40 గ్రాముల బరువున్న 'లెసోనార్ 2' అనే డ్రోన్‌ను తయారు చేసింది. ఇది అల్ట్రాసోనిక్ ఫేజ్డ్-సోనార్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. అంటే, ఒకే పరికరంలో అనేక చిన్న సౌండ్-వేవ్ పార్ట్స్ (శబ్ద తరంగాల భాగాలు) వాడి, పరిసరాల రియల్-టైమ్ 3డీ మ్యాప్‌ను ఇది రూపొందిస్తుంది. కెమెరాలకు బదులుగా సోనార్ వాడటం వల్ల చీకటిలో కూడా ఈ డ్రోన్ దోమలను స్పష్టంగా చూడగలదు.

ఈ డ్రోన్ దోమలను వాటి రూపాన్ని బట్టి కాకుండా, ప్రతి దోమ జాతికి ఉండే ప్రత్యేకమైన వింగ్-బీట్ 'ఫింగర్‌ప్రింట్' (రెక్కల శబ్ద గుర్తింపు) ద్వారా పసిగడుతుంది. గాలిలో దోమను గుర్తించిన వెంటనే, డ్రోన్ దానిపైకి దూసుకెళ్లి తన ప్రొపెల్లర్స్‌తో వాటిని నిర్మూలిస్తుంది. ఇందులో ఉండే 32 అల్ట్రా సోనిక్ ఎమిటర్స్ మనుషులకు వినబడని శబ్ద తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మనుషులకు, పెంపుడు జంతువులకు సురక్షిత దూరంలో ఉండేలా డిజైన్ చేశారు.

ఈ డ్రోన్‌ను నియంత్రించడానికి ప్రత్యేక యాప్, వెబ్ ఇంటర్‌ఫేస్ అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ఫ్లైట్ షెడ్యూల్స్ రూపొందించడం, ఫర్మ్‌వేర్ అప్‌డేట్ చేయడం వంటి పనులు చేసుకోవచ్చు. త్వరలో సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో ఈ కిల్లర్ డ్రోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఫోటాన్ మ్యాట్రిక్స్ ల్యాబ్ అనే సంస్థ కూడా నీలం, ఊదారంగు కాంతితో దోమలను చంపే మరో పరికరాన్ని రూపొందిస్తోంది.

మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు కూడా దోమల నివారణకు హైటెక్ సాధనాలను పరీక్షిస్తున్నాయి. జికా వ్యాధిని వ్యాప్తి చేసే ఈడిస్ ఈజిప్టి దోమలను పట్టుకోవడానికి మైక్రోసాఫ్ట్ స్మార్ట్‌ట్రాప్‌ను ఉపయోగిస్తోంది. కాలిఫోర్నియాలో అల్ఫాబెట్‌కు చెందిన లైఫ్ సైన్సెస్ విభాగం దోమల జనన నియంత్రణపై పరిశోధనలు చేస్తోంది. తొలి దశలో ఈ పరికరాలకు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ, కాలక్రమంలో మెరుగైన పరిష్కారాలు వస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు.