3 నుంచి 10 మిల్లీమీటర్ల పొడవు ఉండే దోమలను చిన్నవిగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్, జీకా వైరస్, ఎన్‌సెఫలైటిస్, వెస్ట్ నైల్ వైరస్ వంటి పలు ప్రాణాంతక వ్యాధులు దోమకాటు ద్వారానే వ్యాపిస్తున్నాయి. భారత్‌లో దోమలు వృద్ధి చెందడానికి అనువైన వాతావరణం ఉండటంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది.
ముఖ్యంగా వానాకాలంలో నీరు నిల్వ ఉండటం, పచ్చదనం పెరగడం దోమల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి. పేదరికం, అపరిశుభ్రత, అవగాహన లేమి వంటి అంశాలు దోమల సమస్యను ప్రధాన ప్రజారోగ్య సవాలుగా మారుస్తున్నాయి. స్పానిష్ భాషలో 'మస్కిటో' అంటే చిన్న ఈగ అని అర్థం. మానవ రక్తాన్ని ఆహారంగా తీసుకునే ఈ దోమల్లో ఆడ అనాఫిలిస్ దోమకాటు వల్ల మలేరియా వ్యాధి సోకుతుందని గుర్తించారు.
బ్రిటిష్ మెడికల్ ఆఫీసర్ రొనాల్డ్ రాస్ 1897 ఆగస్టు 20న మలేరియా వ్యాప్తికి దోమలే కారణమని ప్రపంచానికి వెల్లడించారు. సికింద్రాబాద్ రెజిమెంట్‌లో వైద్య సేవలు అందిస్తున్న సమయంలో ఆయన దోమల జీవిత చక్రంపై పరిశోధనలు చేశారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణకు గాను ఆయనకు 1902లో నోబెల్ బహుమతి లభించింది. ఆయన చేసిన కృషికి గుర్తుగా ప్రతి ఏటా ఆగస్టు 20న ప్రపంచ దోమల దినం పాటిస్తున్నారు.
దోమల బెడదను తగ్గించడానికి నివాసాల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడటం, పాత్రలపై మూతలు పెట్టడం, మురికి కాలువల్లో నీరు ప్రవహించేలా చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వ ఉన్న నీటిలో దోమల గుడ్లను తినే అంబూచియా వంటి చేపలను వదలడం, దోమనాశక పెస్టిసైడ్స్ (దోమలను చంపే రసాయనాలు) పిచికారీ చేయడం, పొగ యంత్రాలను వాడటం వంటి చర్యలు చేపట్టాలి. శరీరాన్ని పూర్తిగా కప్పే బట్టలు వేసుకోవడం, రోగ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు.








