డిసెంబర్ 1 నుంచి వంట గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను విక్రయించే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను సవరిస్తాయి కాబట్టి, వీటిపై అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మారితే, బయట తినే తిండి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇళ్లలో వాడే 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర చాలా కాలంగా స్థిరంగానే ఉంది.
గ్యాస్ సిలిండర్లతో పాటు విమాన ఇంధనం ధరల్లోనూ మార్పులు రావచ్చు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) అని పిలిచే ఈ విమాన ఇంధన ధరలను కూడా కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన సమీక్షిస్తాయి.
కారు కొనాలనుకునే వారికి మాత్రం ఈ నెల కొంత నిరాశ కలిగించే వార్త. టాటా మోటార్స్ తన కార్లు, ఎస్‌యూవీల (SUVs) ధరలను డిసెంబర్ 1 నుంచి పెంచుతోంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVs) మీద కూడా ఈ పెంపు ఉంటుంది. నవంబర్ 24న కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, కారు మోడల్ లేదా వేరియంట్‌ను బట్టి సుమారు 0.5 శాతం వరకు ధరలు పెరగవచ్చు.
పన్నులకు సంబంధించి కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. నవంబర్ 25న నోటిఫై చేసిన ఈ మార్పుల ప్రకారం, జీఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ అప్లికేషన్ ప్రాసెస్‌లో మార్పులు చేశారు.
జీఎస్టీ కామన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను ఎలక్ట్రానిక్‌గా ప్రాసెస్ చేస్తారు. అయితే, ఎవరైనా పన్ను రిటర్నులు పెండింగ్‌లో ఉంచినా లేదా ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నా, వారి దరఖాస్తులను పరిశీలన కోసం సంబంధిత అధికారికి పంపిస్తారు. ఈ నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.







