రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ధమాకా సినిమా 2022లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, రవితేజ కెరీర్‌లో మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది.
ఈ సినిమా సక్సెస్ వేడుకను చిత్రబృందం ఎంతో గ్రాండ్‌గా నిర్వహించింది. ఆ రోజు వేదికపై తాను బాగానే మాట్లాడానని, కానీ ప్రసంగం ముగించుకుని కిందకు దిగిన తర్వాత తనకు కూర్చోవడానికి సరైన స్థలం దొరకలేదని త్రినాథరావు నక్కిన తెలిపారు. అంత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడికి కనీసం ఒక కుర్చీ కూడా లేకపోవడం తనను ఎంతో బాధించిందని ఆయన పేర్కొన్నారు.
చివరకు ఖాళీ కోసం వెతుక్కుంటూ వెళ్లి రెండో వరుసలో కూర్చోవాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఎవరూ గమనించలేదని తాను భావించానని, కానీ ఇటీవల ఒక పెద్ద మనిషి ఆ సంఘటనను గుర్తు చేస్తూ ఎలా భరించావని అడగడంతో చాలా మంది గమనించారని అర్థమైందని చెప్పారు.
ఆ రోజు ఆ సంఘటన పట్ల తాను చాలా బాధపడినప్పటికీ, ఫంక్షన్ ముగిసిన తర్వాత ఆ విషయాన్ని అక్కడితో వదిలేశానని త్రినాథరావు నక్కిన స్పష్టం చేశారు.








