అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్ విజేతలకు ఫిఫా ప్రత్యేకమైన ఛాంపియన్‌షిప్ రింగ్స్‌ను బహూకరించనుంది. అమెరికాలోని ఎన్‌బీఏ (NBA) బాస్కెట్ బాల్ ఈవెంట్ సంప్రదాయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఫిఫా చరిత్రలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. జూలై 19, ఆదివారం న్యూ జెర్సీలోని న్యూయార్క్ స్టేడియంలో జరగనున్న ఫైనల్‌లో గెలిచిన జట్టుకు ట్రోఫీ, గోల్డ్ మెడల్స్‌తో పాటు ఈ ఉంగరాలను అందజేస్తారు.

ఈ ఎడిషన్ కోసం మొత్తం 2026 ఉంగరాలను ఫిఫా సిద్ధం చేస్తోంది. ఇందులో 30 రింగ్స్‌ను విజేతగా నిలిచిన జట్టు ఆటగాళ్లకు, సిబ్బందికి కేటాయించగా, మిగిలిన 1,996 ఉంగరాలను గుర్తింపు పొందిన సంస్థల ద్వారా అభిమానులకు విక్రయించనున్నారు. ఈ ఉంగరాల రూపకల్పనలో ఒకవైపు ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ, మరోవైపు విజేత దేశపు చిహ్నాన్ని ముద్రించనున్నారు. ప్రతి ఉంగరానికి ప్రత్యేకమైన వ్యక్తిగత నంబర్ కూడా ఉంటుంది.

ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే విన్నింగ్ టీమ్ కెప్టెన్, కోచ్‌కు తాత్కాలిక ఛాంపియన్‌షిప్ రింగ్స్‌ను ప్రదానం చేస్తారు. ఆ తర్వాత ఆటగాళ్లు, సిబ్బంది వేళ్లకు సరిపోయేలా కస్టమైజ్ చేసిన ఉంగరాలను ఫిఫా అధికారికంగా అందజేయనుంది. స్పెయిన్, అర్జెంటీనా జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌కు డోనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు.