కొరియా మాస్టర్స్-2026 టోర్నీలో భారత సీనియర్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఆశలు తొలి రౌండ్‌లోనే ముగిశాయి. ఇజ్రాయెల్ క్రీడాకారుడు డానిల్ డుబోవెంకోతో జరిగిన పోరులో శ్రీకాంత్ 20-22, 14-21, 12-21 స్కోరుతో పరాజయం పొందాడు. ఈ ఏడాది యూఎస్ ఓపెన్ ఫైనల్ వరకు వెళ్లిన శ్రీకాంత్, ఈ టోర్నీలో మాత్రం తన జోరును కొనసాగించలేకపోయాడు.

యువ క్రీడాకారిణి తన్వి శర్మ మాత్రం విజయంతో టోర్నీని ఘనంగా ప్రారంభించింది. చైనాకు చెందిన యువాన్ ఆన్ కీపై 21-16, 21-15 తేడాతో గెలుపొంది తన్వి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. తదుపరి మ్యాచ్‌లో తన్వి శర్మ మరో భారత క్రీడాకారిణి శ్రీయాంశి వాలిశెట్టితో తలపడనుంది.

మహిళల సింగిల్స్‌లో మాన్సీ సింగ్ కూడా శుభారంభం చేసింది. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జూ యూన్‌తో జరిగిన మూడు గేమ్‌ల హోరాహోరీ పోరులో మాన్సీ విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. పురుషుల డబుల్స్ విభాగంలో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ – కృష్ణ ప్రసాద్ గరగ జోడీ అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచ 118వ ర్యాంకులో ఉన్న ఈ భారత జోడీ, నాలుగో సీడ్ థాయ్‌లాండ్ జంటను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.

మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో ప్రియా కొంజెంగ్బం – శృతి మిశ్రా జోడీకి నిరాశ ఎదురైంది. ఈ జంట తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.