దేవరకొండ రూరల్ మండలంలోని కొండ భీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో నివాసం ఉంటున్న మహిళలు, స్థానికులు శనివారం జాతీయ రహదారి 167పై ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో రోజువారీ అవసరాలకు కూడా నీళ్లు దొరకడం లేదని, పిల్లలు, పెద్దలు నరకం చూస్తున్నారని నిరసనకారులు నినాదాలు చేశారు. తాగునీటితో పాటు డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నా కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు రెండు గంటలకు పైగా నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ రాయదుర్గారెడ్డి, సీఐ వెంకట్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాగునీటి సమస్యతో పాటు ఇతర ఇబ్బందులను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. అధికారుల హామీతో కాలనీవాసులు ధర్నాను విరమించగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.