సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం ఢిల్లీ మెట్రో రైళ్లలో ఇష్టారీతిన వీడియోలు తీసే కంటెంట్ క్రియేటర్లకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. సినిమాల్లో మాదిరిగా అతిగా ప్రవర్తించడం ఆపాలని, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే పనులు చేయవద్దని సూచించింది.

ఇటీవల కంటెంట్ క్రియేటర్ నిఖిల్ కోచర్ తన ఫోన్‌ను మెట్రో రైలు అద్దానికి అతికించి, రైలు పక్కనే పరిగెడుతూ వీడియో తీశాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించడంతో, ఇది ఒక ట్రెండ్‌గా మారింది. దీనిని చూసి నందిని శుక్లా అనే మరో క్రియేటర్ కూడా అదే తరహాలో వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో ఢిల్లీ మెట్రో అధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో మెట్రో రైళ్లలో లేదా రైల్వే స్టేషన్ల పరిసరాల్లో ఇటువంటి వీడియోలు చిత్రీకరించవద్దని క్రియేటర్లను అధికారులు హెచ్చరించారు.

మెట్రోలో క్రియేటర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ప్రయాణికులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారీతిన వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో స్పష్టం చేసింది. ఇకపై ఇటువంటి పనులకు పాల్పడే వారిపై అధికారులు నిఘా పెంచే అవకాశం ఉంది.