గ్యాంబ్లింగ్ అంటే అదృష్టం కాదని, అది ఒక అల్గారిథమ్ అని నమ్మే జాన్ అనే యువకుడి కథే 'ఐమ్ గేమ్'. జీవితాన్ని కేవలం జూదం, క్రికెట్ బెట్టింగ్‌లకే పరిమితం చేసుకున్న జాన్, అనుకోకుండా తన తండ్రి వ్యాపార బాధ్యతలను చేపట్టాల్సి వస్తుంది. ఈ కొత్త పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో జరిగిన ఒక ప్రమాదం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలే ఈ సినిమా కథ.

దర్శకుడు నహాస్ హిదాయత్ ఈ చిత్రాన్ని గ్యాంబ్లింగ్ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టారు. హైదరాబాద్ నగరాన్ని మునుపెన్నడూ చూడని విధంగా డార్క్ అండ్ కొత్త కోణంలో చూపించడంలో దర్శకుడు విజయం సాధించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, రియలిస్టిక్ డైలాగులు సినిమాకు మంచి బలాన్ని ఇచ్చాయి.

అయితే, సినిమా సెకండాఫ్ మొదలయ్యాక కథా గమనం నెమ్మదిస్తుంది. విక్కీ అనే పాత్ర చుట్టూ సాగే ఫ్లాష్‌బ్యాక్ చాలా సాగదీసినట్లు అనిపిస్తుంది. పాతకాలపు పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే యాక్షన్ సీన్స్, బెట్టింగ్ వల్ల కలిగే నష్టాల గురించి చెప్పిన సందేశం కథలో సహజంగా కలిసిపోలేదు.

నటన విషయానికి వస్తే, దుల్కర్ సల్మాన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో అతిథి పాత్రలో కనిపించిన ఆంటోని వర్గీస్ తన నటనతో ఎమోషనల్ టచ్ ఇచ్చారు. మిస్కిన్, కదిర్, కాయదు లోహర్ వంటి నటులు తమ పరిధి మేరకు చక్కగా నటించారు.

సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జేక్స్ బిజాయ్ అందించిన నేపథ్య సంగీతం, జిమ్షి ఖలీద్ కెమెరా పనితనం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా సాగాయి. చమన్ చాకో ఎడిటింగ్ కూడా బాగుంది. అద్భుతమైన ఫాంటసీ థ్రిల్లర్‌గా మొదలైన సినిమా, చివరికి రొటీన్ రివెంజ్ డ్రామాగా మారిపోవడంతో ప్రేక్షకులు కొంత నిరాశ చెందే అవకాశం ఉంది.