దర్శకుడు పూరీ జగన్నాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన నానమ్మ మరణించినట్లు పూరీ కుమార్తె పవిత్ర తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె తన నానమ్మతో ఉన్న పాత ఫోటోను పంచుకుంటూ భావోద్వేగ సందేశాన్ని రాశారు.

'ఇప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు? ప్రేమగా నన్నెవరు ముద్దుపెట్టుకుంటారు? నీతో మరోరోజు గడిపే అవకాశం ఉంటే బాగుండు. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లు పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ' అంటూ పవిత్ర తన బాధను వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియగానే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

మరోవైపు పూరీ జగన్నాథ్ సినిమాల విషయానికి వస్తే, ఆయన విజయ్ సేతుపతి హీరోగా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ సంస్థలపై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రొల్లా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.