సూర్యపేట జిల్లా కోదాడలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో రాజకీయ కారణాలు, వ్యక్తిగత కక్షలకు తావులేకుండా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధికారులను హెచ్చరించారు. ఆదివారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు విధానాలు పాటిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

బాలాజీ నగర్‌లో నిర్మించిన 560 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో, 548 మందికి అధికారులు పట్టాలు పంపిణీ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కలెక్టర్ పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా పూర్తి చేశానని, అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల సాంకేతిక కారణాలతో అప్పట్లో పట్టాల పంపిణీ నిలిచిపోయిందని గుర్తు చేశారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతులను తక్షణమే పూర్తి చేసి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని తాము పలుమార్లు ఆందోళనలు చేశామని మల్లయ్య యాదవ్ తెలిపారు. ప్రస్తుతం అండర్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆయన విమర్శించారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఎస్ కే నయీమ్, కౌన్సిలర్లు చీమ నరేష్, ఉపేందర్ గౌడ్, అలవాల వెంకట్, ఉపేందర్, కరీముల్లా పాల్గొన్నారు. మిగిలిన ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు.