కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) దేశవ్యాప్తంగా 22 క్రీడా విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇందులో 182 హెడ్ కానిస్టేబుల్ (General Duty) పోస్టులు, 339 కానిస్టేబుల్ (General Duty) పోస్టులు ఉన్నాయి. పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వీరు అంతర్జాతీయ క్రీడా పోటీల్లో దేశం తరఫున ఆడి ఉండాలి లేదా నేషనల్ గేమ్స్, ఛాంపియన్‌షిప్స్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్స్, ఖేలో ఇండియా లేదా నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొన్న అనుభవం ఉండాలి.
అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 2008, ఆగస్టు 1 తర్వాత జన్మించిన వారు ఈ పోస్టులకు అనర్హులు. అయితే, అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ (Non-Creamy Layer) అభ్యర్థులకు 8 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంది. ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు వారి కేటగిరీని బట్టి 8 నుంచి 13 ఏళ్ల వరకు సడలింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియలో డాక్యుమెంటేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) అంటే శారీరక కొలతల పరీక్ష, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. అభ్యర్థులు సాధించిన పతకాలను బట్టి మార్కులు కేటాయించి మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఎంపికైన వారికి హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,000, కానిస్టేబుల్ పోస్టుకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ. 100గా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఎలాంటి ఫీజు లేదు. ఆసక్తి ఉన్నవారు https://rect.crpf.gov.in వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.








