తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సయోధ్య లేకపోవడం, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిలిచిపోయిన మండల, టౌన్, డివిజన్ అధ్యక్షుల నియామక ప్రక్రియను పార్టీ వేగవంతం చేసింది. ఇందుకోసం రాష్ట్రంలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక పరిశీలకులను (అబ్జర్వర్లను) నియమిస్తూ పీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుడు మహేశ్ గౌడ్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రకటన విడుదల చేశారు.

ఈ నియామకాల్లో భాగంగా కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్ ఈస్ట్, బాన్సువాడ, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులు వెళ్లనున్నారు. పీసీసీ నియమించిన ఈ అబ్జర్వర్ల జాబితాలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గానికి నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, శేరిలింగంపల్లికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని పరిశీలకులుగా కేటాయించారు. అలాగే వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కరీంనగర్ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను నియమించారు.

నియమితులైన పరిశీలకులు ఈ నెల 31 లోపు సంబంధిత మండల, టౌన్, డివిజన్ కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ క్షేత్రస్థాయిలో పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసే బాధ్యతను వీరు తీసుకోవాలని పీసీసీ స్పష్టం చేసింది.