Congress | హైదరాబాద్‌, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): ‘ఆలిలేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా తయారైంది సింగిల్‌ విండో చైర్మన్‌ పదవుల కోసం పైరవీల వ్యవహారం. పీఏసీఎస్‌ పాలకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయో.. లేక నామినేటెడ్‌ విధానంలో చైర్మన్లు, డైరెక్టర్లను నియమిస్తారో.. చివరకు కోర్టు ఏం చెబుతుందో ఇంకా తెలియదు. కానీ, అప్పుడే ఆ కుర్చీ కోసం కాంగ్రెస్‌లో మాత్రం రేసు మొదలైంది. నామినేటెడ్‌ పోస్టుల వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో ఉన్నది. ఈ నెల 17న విచారణ జరుగాల్సి ఉన్నది. ఆ తర్వాతే ప్రభుత్వం తదుపరి అడుగు వేయాల్సి ఉంటుంది.

సింగిల్‌ విండో చైర్మన్‌, డైరెక్టర్ల నియామకాల కోసం విధివిధానాలు సిద్ధమైనట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితరులు ప్రకటించిన నేపథ్యంలో సింగిల్‌ విండో సొసైటీల చైర్మన్‌ పదవులకు పైరవీలు జోరందుకున్నాయి. ఎన్నికలకు బదులు నామినేటెడ్‌ విధానంలో పీఏసీఎస్‌ పాలకమండళ్లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో రాజకీయ వేడి రాజకుంటున్నది. ఒకో సొసైటీకీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల పదవులు ఉండటంతో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. ఫలితంగా ఎమ్మెల్యేల ఇండ్ల నుంచి మంత్రుల కార్యాలయాల వరకు పైరవీల పరంపర మొదలైందన్న చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జోరుగా సాగుతున్నది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఒకో సంఘానికి ఒక చైర్మన్‌, 13 మంది సభ్యుల చొప్పున రెండేండ్ల కాలవ్యవధికి నియామకాలు జరుగాల్సి ఉన్నది. చైర్మన్‌ పదవి అంటే కేవలం సహకార సంఘానికి అధ్యక్షత వహించే హోదా కాదన్న భావన గ్రామీణ రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్నది. స్థానికంగా పరపతి పెంచుకోవడానికి, గ్రామాల్లో రాజకీయ ప్రాభవాన్ని నిలబెట్టుకోవడానికి, భవిష్యత్తు ఎన్నికల్లో అనుచర వర్గాన్ని కదిలించడానికి ఈ పదవి ఉపయోగపడుతుందని నేతలు భావిస్తున్నారు. అందుకే ఒక్కో సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి పదుల సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ కోసం ఏండ్ల తరబడి పనిచేసిన సీనియర్లు ఒకవైపు.. ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్న కొత్త ముఖాలు మరోవైపు పోటీపడుతున్నారు. నామినేటెడ్‌ పదవుల కోసం జరుగుతున్న పోరులో ఇదే ఇప్పుడు ప్రధాన ఘర్షణగా మారుతున్నది. ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల మధ్య ఈ నియామకాలు తీవ్ర విభేదాలకు దారితీస్తున్నాయి. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన సీనియర్‌ నాయకులను పకనపెట్టి, స్థానిక ఎమ్మెల్యేలు తమ సొంత అనుచరులైన జూనియర్లకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. డీసీసీ అధ్యక్షులు పంపిన ప్రతిపాదనలను తోసిరాజంటూ ఎమ్మెల్యేలు నేరుగా ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలోనే నియామకాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రచ్చ చివరకు పీసీసీ వద్దకు చేరింది.

పీఏసీఎస్‌లకు ఎన్నికైన పాలకవర్గాల స్థానంలో ‘పర్సన్‌ ఇన్‌చార్జ్‌’ కమిటీలను నియమిస్తూ గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో-597ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ జీవో అమలును నిలిపివేస్తూ హైకోర్టు 2026 జనవరి 9న ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏప్రిల్‌ 27న జీవో-199 ద్వారా తన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నది. అనంతరం ఏప్రిల్‌ 29న హైకోర్టు ఈ పిటిషన్లను పరిషరిస్తూ.. ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనే వరకు 2025 ఫిబ్రవరి 14న ఉన్న ఎన్నికైన పాలకవర్గాలే కొనసాగాలని స్పష్టం చేసింది.

ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ నామినేటెడ్‌ విధానంలో పీఏసీఎస్‌ పాలకవర్గాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుండటంతో ఈ అంశం మరోసారి న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఈ నెల 17న జరిగే విచారణలో కోర్టు వైఖరి కీలకం కానున్నది. ఒకవేళ కోర్టు అభ్యంతరం కొనసాగితే, నామినేషన్‌ ద్వారా పాలకవర్గాలను ఏర్పాటు చేసేందుకు చట్టపరమైన మార్గాలను ప్రభుత్వం అన్వేషించాల్సి ఉంటుంది. అంటే గతంలో కోర్టు అడ్డుకున్న మార్గాన్నే ఈసారి చట్ట సవరణ లేదా ఆర్డినెన్స్‌ అండతో మళ్లీ తెరువాలన్న ప్రయత్నమే ఇప్పుడు వివాదం రాజేస్తున్నది.

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గ ఆర్నకొండ పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవి వ్యవహారం గాంధీభవన్‌కు చేరింది. సీనియర్‌ నాయకులను కాదని, స్థానిక ఎమ్మెల్యే తన అనుచరుడైన జూనియర్‌కు నామినేటెడ్‌ పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో స్థానిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మంత్రులు, డీసీసీ అధ్యక్షుల వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు సాగుతున్నది. నల్లగొండ, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పంపిన జాబితాలనే ప్రభుత్వం ఖరారు చేస్తుండటంతో, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చారకొండ సహా పలు మండలాల్లో పాత పాలకవర్గాల స్థానంలో కొత్తవారిని నామినేట్‌ చేసే ప్రక్రియ ఘర్షణ వాతావరణానికి దారితీస్తున్నది.