కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా సక్సెస్ మీట్ వేదికపై హీరోయిన్ గౌరిప్రియ తన తల్లిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా గౌరిప్రియ మాట్లాడుతూ, తన తల్లి బతికి ఉంటే ఈ విజయాన్ని చూసి ఎంతో సంతోషించేవారని పేర్కొన్నారు. విశాల, ప్రమోదిని వంటి వారు తన తల్లిలాగే తనకు మంచి మాటలు చెబుతూ ప్రోత్సహిస్తున్నారని ఆమె తెలిపారు. తన తండ్రి మద్దతు, తల్లి ఆశీస్సులు, దేవుడి దయ వల్లే తనకు ఈ గుర్తింపు వచ్చిందని ఆమె చెప్పారు.

జూలై 23న ప్రీమియర్ షోలు పడగా, జూలై 24న సినిమా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే కలెక్షన్స్, ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉన్నాయని ఆమె వెల్లడించారు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ అనే తేడా లేకుండా ప్రేక్షకులందరూ సినిమాను ఒకేలా ఎంజాయ్ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని గౌరిప్రియ సంతోషం వ్యక్తం చేశారు.