మాచర్ల సమీపంలోని దుర్గి మండలంలో 1960లలో నిర్మించిన బుగ్గవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిస్థితి దశాబ్దాలుగా మారలేదు. నాగార్జునసాగర్ కుడి కాలువకు అనుసంధానంగా ఉన్న ఈ ప్రాజెక్టు 3 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా రూపొందింది. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3.463 టీఎంసీలు కాగా, 1.698 టీఎంసీల డెడ్ స్టోరేజీ ఉంది. పూడిక తొలగింపు ద్వారా సామర్థ్యాన్ని 5 టీఎంసీలకు పెంచే అవకాశం ఉన్నప్పటికీ, ఏళ్లుగా ఈ ప్రాజెక్టు పూడికలోనే మగ్గుతోంది.

గత ప్రభుత్వాల హయాంలో బుగ్గవాగు ఆధునికీకరణపై అనేక హామీలు వెలువడ్డాయి. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మాచర్లకు తాగునీటి ప్రణాళికను సిద్ధం చేయగా, ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయించినట్లు ప్రచారం జరిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా ఎన్నికల హామీల్లో దీనిని ప్రస్తావించినా, ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడలేదు.

పల్నాడులో తాగు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలో బుగ్గవాగు కీలకం. వేసవిలో బోర్లు అడుగంటి ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నా, ఈ రిజర్వాయర్ సామర్థ్యం పెంపుపై దృష్టి సారించలేదు. జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర పథకాలు సక్రమంగా అమలు కావాలన్నా, వాటర్‌గ్రిడ్ పనులు విజయవంతం కావాలన్నా నీటి వనరుల బలోపేతం తప్పనిసరి.

ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఆధునికీకరణ ఆవశ్యకతను వివరించినట్లు సమాచారం. ఈసారైనా హామీలు కార్యాచరణగా మారుతాయా అన్నది వేచి చూడాలి.