జాక్ డోర్సీ రూపొందించిన Bitchat మెసేజింగ్ యాప్ రిపోజిటరీలను తొలగించాలని GitHub సంస్థను భారత ప్రభుత్వం ఆదేశించింది. బ్లూటూత్ లో ఎనర్జీ (Bluetooth Low Energy) సాంకేతికతను ఉపయోగించి, ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా మెసేజ్‌లు పంపుకునేలా ఈ యాప్‌ను డిజైన్ చేశారు.
ఈ యాప్ ద్వారా అక్రమ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని, ఇది దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు ముప్పు కలిగిస్తుందని ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 79(3)(బి) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021లోని రూల్ 3(1)(డి) నిబంధనలను ప్రభుత్వం అమలు చేసింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, నియంతృత్వ ధోరణితో ఉన్నాయని ఆ సంస్థ విమర్శించింది.







