భారత క్రికెటర్లు తరచుగా గాయాల బారిన పడటం, కోలుకోవడంలో జాప్యం జరగడంపై బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) అత్యవసర సమీక్షకు సిద్ధమైంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఆ విభాగం హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీల మధ్య ఎలాంటి అంతరం లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. మహిళా, పురుష జట్ల మేనేజ్‌మెంట్‌తో పాటు స్పోర్ట్స్ సైన్స్ మెడిసిన్ విభాగంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. ఆటగాళ్ల పురోగతిపై సెలెక్టర్లు, హెడ్ కోచ్‌లతో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఇటీవలి కాలంలో విదేశీ పర్యటనలకు ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం, కోలుకున్న తర్వాత మళ్లీ గాయాలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు రావడం వంటి అంశాలు చర్చనీయాంశమయ్యాయి. రికవరీ ప్రక్రియ అనేది ఆటగాళ్లు, జట్టుకు సంబంధించినదని, ఈ విషయంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. శ్రీలంక సిరీస్‌కు సిద్ధంగా లేని క్రికెటర్ల పరిస్థితిపై కూడా తాము చర్చిస్తున్నామని ఆయన వివరించారు.








