తెలంగాణలో భూగర్భ జల మట్టాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం 'జలసిరి' కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క కోరారు. ముఖ్యంగా ఇంకుడు గుంతల నిర్మాణంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులను ఖరారు చేసేందుకు గ్రామ సభలను నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా ఈ పనులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు. మహిళా సంఘాలు, మహిళా రైతులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని మంత్రి సూచించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.








