భీమ్‌గల్ పట్టణంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన వంద పడకల దవాఖాన, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు, మూతపడిన ఆర్టీసీ బస్సు డిపో, సీసీ రోడ్లను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భీమ్‌గల్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
గతంలో మూతపడిన ఆర్టీసీ డిపోను రూ. 2.25 కోట్ల ఖర్చుతో మరమ్మతులు చేయించి, బస్సు సర్వీసులను తాము పునరుద్ధరించామని ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ డిపోను మళ్లీ నిరుపయోగంగా మార్చారని, కనీసం కూలిన ప్రహరీని కూడా బాగు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణ అభివృద్ధి కోసం అప్పటి మంత్రి కేటీఆర్ సహకారంతో రూ. 12 కోట్ల పనులకు టెండర్లు పూర్తి చేశామని, అయితే కాంగ్రెస్ పాలకులు కాంట్రాక్టర్లకు ఎనిమిది నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని ఆయన వివరించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో హడావుడిగా పనులు ప్రారంభించినా, నిధుల విడుదల లేకపోవడంతో అవి ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు.
వంద పడకల దవాఖాన నిర్మాణానికి సంబంధించి 75 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 25 శాతం పనుల కోసం వైద్యారోగ్య శాఖ మంత్రి రూ. 5 కోట్లు ఇస్తామని చెప్పి కేవలం రూ. 2.27 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఆయన తెలిపారు. ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, కేవలం రూ. 30 లక్షల విలువైన నామమాత్రపు పనులు మాత్రమే జరిగాయని ఆయన విమర్శించారు.
ఈ సమస్యలపై శాసనసభలో గళమెత్తినా, క్షేత్రస్థాయిలో పోరాడినా ప్రభుత్వం స్పందించడం లేదని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.








