భీమారంలోని బీరువాల షాపు వద్ద శనివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన పండాల రాజు (32) అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్, ప్రస్తుతం రామారంలో నివాసం ఉంటున్నాడు.

ప్రమాదం జరిగిన సమయంలో రాజు తన బైక్‌పై యూటర్న్ తీసుకుంటుండగా, హుజూరాబాద్ నుంచి హనుమకొండ వైపు వస్తున్న మరో బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్‌ఆర్‌ఆర్‌ తోటకు చెందిన మనోజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

సమాచారం అందుకున్న కేయూ ఎస్సై బి. విజయ్‌కుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే రాజు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

ప్రస్తుతం మనోజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.