భారతదేశపు తొలి సుమో రెజ్లర్ హేతల్ దవే జీవిత చరిత్రను ‘సుమో దీదీ’ పేరుతో సినిమాగా తెరకెక్కించారు. జయంత్ రోహత్గి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హేతల్ దవే పాత్రను శియం భగ్నానీ పోషించారు. ఈ సినిమా త్వరలో ZEE5 యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదలైన టీజర్, హేతల్ దవే ఎదుర్కొన్న సామాజిక సవాళ్లను పరిచయం చేస్తోంది. ‘‘నువ్వు బరువు తగ్గకపోతే, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు’’ అంటూ కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించడంతో టీజర్ మొదలవుతుంది. చిన్నప్పటి నుంచి క్రీడల పట్ల ఆసక్తి ఉన్న హేతల్ దవే, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే క్రమంలో ఎలాంటి కష్టాలు, అవమానాలను అధిగమించారో ఈ సినిమాలో చూపించనున్నారు.
ముంబైకి చెందిన హేతల్ దవే భారతదేశపు మొదటి సుమో రెజ్లర్‌గా చరిత్ర సృష్టించడమే కాకుండా, ప్రపంచంలోని టాప్-5 సుమో రెజ్లర్లలో ఒకరిగా నిలిచారు. ఈ సినిమా ఇప్పటికే టోక్యో ఫిలిమ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిలిమ్ ఫెస్టివల్‌తో పాటు పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.








