భద్రాచలం ఎమ్మెల్యే పీఏగా పనిచేసిన కొర్ల కల్యాణ్‌కుమార్‌పై రాయల శ్రీను అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ఆటోను, కూతురి బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.9.95 లక్షలను కల్యాణ్‌ చెప్పిన ఖాతాల్లో జమ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కల్యాణ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం అందగా, అధికారులు అతన్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

కల్యాణ్‌ ప్రభుత్వ ఉద్యోగిగా సబ్‌కలెక్టరేట్‌లో పనిచేసిన అనుభవంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల లోగోలు, ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నకిలీ నియామక పత్రాలను సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మణుగూరు బీటీపీఎస్ భూ నిర్వాసితుల సమాచారాన్ని సేకరించి, వారికి ఉద్యోగాల పేరుతో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. భద్రాచలంకు చెందిన ఓ వైద్యుడి నుంచి రూ.40 లక్షలు, జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి నుంచి రూ.10 లక్షలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా సుమారు 100 నుంచి 150 మంది బాధితులు ఉన్నట్లు అంచనా.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేంద్రంగానే ఈ ఆర్థిక మోసాలు జరగడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఎమ్మెల్యే పక్కనే ఉండే పీఏకు సంబంధించిన లావాదేవీలు ఆయనకు తెలియకుండా ఎలా జరుగుతాయని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ ఇసుక ర్యాంపుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘటన బయటపడటంతో, ఎమ్మెల్యే అతన్ని కార్యాలయానికి రాకుండా తొలగించారు. ఆరు నెలలు గడవకముందే మళ్లీ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం పోలీసులు కల్యాణ్‌ను విచారిస్తూ, వసూలు చేసిన డబ్బులను ఏం చేశారనే అంశంపై ఆరా తీస్తున్నారు. అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విచారణ వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. బాధితులు తమకు న్యాయం చేసి, డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు.