బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో ఉన్న హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వద్ద ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మరియు పెన్ డ్రైవ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం కేంద్ర నేర విభాగం (CCB) అధికారులు జైలులో నిర్వహించిన సోదాల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ అలోక్ కుమార్ ధృవీకరించారు.
హై సెక్యూరిటీ జైలులో ఉన్న ఖైదీల బ్యారక్ లలో సుమారు నాలుగు నుంచి ఐదు గంటల పాటు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రేవణ్ణ వద్ద ఫోన్, పెన్ డ్రైవ్ దొరకడంతో జైలు భద్రతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జైలు లోపలికి ఈ పరికరాలు ఎలా వచ్చాయి, వీటిని ఎవరు అందించారు, ఇందులో జైలు సిబ్బంది పాత్ర ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక సీనియర్ జైలు అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా, భద్రతా లోపాలపై వివరణ ఇవ్వాలంటూ జైలు సూపరింటెండెంట్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ్ మనవడైన ప్రజ్వల్ రేవణ్ణ, తన నివాసంలో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ సెక్స్ కుంభకోణంపై సిట్ (SIT) అధికారులు విచారణ జరిపారు. ప్రస్తుతం జైలులో దొరికిన పరికరాలపై జరుగుతున్న విచారణలో వెలువడే వివరాల ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.








