బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో రిటైర్డ్ స్కూల్ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె ఆగామి (23), కుమారుడు ప్రియమ్ (12) తమ ఇంట్లోనే శవాలుగా కనిపించారు. ఈ హత్యల వెనుక ఉన్న కారణాలను రంగ్‌పూర్ మెట్రోపాలిటన్ పోలీసులు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (నేరాలను దర్యాప్తు చేసే విభాగం), డిటెక్టివ్ బ్రాంచ్ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేసి వెల్లడించారు.
గురువారం రాత్రి ఇద్దరు నిందితులు పక్కింటి భవనం మీదుగా గణపతి ఇంటి పైకప్పుపైకి చేరుకున్నారు. అక్కడ వారు యాబా (Yaba) అనే మెథాంఫెటమైన్ రకానికి చెందిన మత్తుమందును తీసుకుంటుండగా, గణపతి గమనించి వారిని ప్రశ్నించారు. తమ డ్రగ్స్ అలవాటు బయటపడుతుందనే భయంతో నిందితులు గణపతిని గొంతు నులిమి చంపేశారు.
ఈ గొడవ శబ్ధాలు విని బయటకు వచ్చిన భార్య ప్రీతిలతను కూడా నిందితులు అదే విధంగా హత్య చేశారు. ఆ తర్వాత కుమార్తె ఆగామిని, కుమారుడు ప్రియమ్‌ను కూడా చంపేశారు. ప్రియమ్‌కు నిందితుల్లో ఒకరైన సిద్ధార్థ తమ్ముడు అపూర్వతో స్నేహం ఉండటం వల్ల, తమను గుర్తుపడతాడనే భయంతోనే అతడిని కూడా హత్య చేసినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
హత్యలు చేసిన తర్వాత నిందితులు వెంటనే అక్కడి నుంచి పారిపోలేదు. దాదాపు 6 నుంచి 7 గంటల పాటు అదే ఇంట్లో ఉండి, అక్కడ ఉన్న ఖర్జూరా, దోసకాయలు తిన్నారు. అనంతరం స్నానం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు బంగ్లాదేశ్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఈ కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం గానీ, గొడవలు గానీ లేవని దర్యాప్తులో తేలింది. రంగ్‌పూర్ పోలీస్ కమిషనర్ మహమ్మద్ అబ్దుల్ మాబుద్ తెలిపిన వివరాల ప్రకారం, మగ్ధో మరియు సిద్ధార్థ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.







