అమెరికా జాతీయ గూఢచార విభాగం మాజీ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ తన భర్త అబ్రహం విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ఆయన వెన్నుముక కింది భాగంలో, తోక ఎముక వద్ద సాక్రల్ కార్డోమా అనే అరుదైన క్యాన్సర్ కణితిని వైద్యులు గుర్తించినట్లు ఆమె వెల్లడించారు. నిరంతర వెన్నునొప్పితో విలియమ్స్ బాధపడుతుండటంతో పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది.
ఈ క్యాన్సర్ కణితి ఉన్న చోటు చాలా సున్నితమైనది కావడంతో, చికిత్సలో భాగంగా సంక్లిష్టమైన శస్త్రచికిత్స అవసరమైంది. వైద్యులు క్యాన్సర్ కణజాలాన్ని విజయవంతంగా తొలగించామని చెబుతున్నప్పటికీ, కోలుకునే ప్రక్రియ చాలా కాలం పడుతుందని గబ్బర్డ్ వివరించారు. ప్రస్తుతం విలియమ్స్ పునరావాసం (రిహాబిలిటేషన్) పొందుతూ, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.
భర్త అనారోగ్యం కారణంగానే గబ్బర్డ్ తన ప్రభుత్వ పదవి నుంచి తప్పుకున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో జాతీయ గూఢచార విభాగం డైరెక్టర్‌గా ఉన్న ఆమె, తన భర్త చికిత్స సమయంలో తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం మేరకు జూన్ 30న ఆమె రాజీనామా అమల్లోకి వచ్చింది.
ఈ కష్టకాలంలో భర్తకు మద్దతుగా ఉండటం తన బాధ్యత అని గబ్బర్డ్ పేర్కొన్నారు. కఠినమైన ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తూ ఆయన పోరాటాన్ని ఒంటరిగా వదిలేయడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పారు. ఇది తమ కుటుంబానికి చాలా కష్టతరమైన అనుభవమని ఆమె సీబీఎస్ న్యూస్‌తో పంచుకున్నారు.
హవాయికి చెందిన సినిమాటోగ్రాఫర్ అయిన విలియమ్స్‌ను గబ్బర్డ్ 2015లో సాంప్రదాయ వైదిక హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. 2012లో అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన మొదటి హిందూ అమెరికన్‌గా గుర్తింపు పొందిన గబ్బర్డ్, ప్రస్తుతం వాషింగ్టన్ రాజకీయాలకు దూరంగా కుటుంబ జీవితంపై దృష్టి సారించారు. భర్త కోలుకునే వరకు వైద్య పర్యవేక్షణ కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.








