భారతదేశానికి 15,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత శీతల ఖండం అంటార్కిటికాలో భారత శాస్త్రవేత్తలు వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. ధ్రువ ప్రాంతాలు, సముద్రాలపై పరిశోధనలు చేసే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR) సంస్థకు చెందిన బృందం ఈ వేడుకల్లో పాల్గొంది.

అక్కడ ఉన్న భారత పరిశోధన కేంద్రం 'మైత్రి'లో శాస్త్రవేత్తలు మంచును ఉపయోగించి గణనాథుడి విగ్రహాన్ని స్వయంగా రూపొందించారు. గడ్డకట్టే చలిని కూడా లెక్కచేయకుండా, ఎటువంటి అచ్చులు లేకుండా కేవలం చేతులతోనే ఈ విగ్రహాన్ని వారు తీర్చిదిద్దారు.

విగ్రహ తయారీ అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం శాస్త్రవేత్తలు హారతి ఇచ్చి, మోదకాలను నైవేద్యంగా సమర్పించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన నిమజ్జన ఘట్టం అందరి దృష్టిని ఆకర్షించింది.

అంటార్కిటికాలోని సున్నితమైన పర్యావరణానికి ఎటువంటి హాని కలగకూడదని శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పరిశోధన కేంద్రం లోపల ఒక బకెట్‌లో నీటిని తీసుకుని, అందులోనే మంచు గణపతిని నిమజ్జనం చేశారు. కొద్దిసేపటికే ఆ మంచు విగ్రహం నీటిలో పూర్తిగా కలిసిపోయింది.

ఈ అపురూప దృశ్యాలను బృందంలోని డాక్టర్ అనిరుధ్ ధర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో, కఠిన పరిస్థితుల్లోనూ సంస్కృతిని కాపాడుకుంటూ పర్యావరణ స్పృహతో వ్యవహరించిన శాస్త్రవేత్తలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.