హైదరాబాద్ అమీర్‌పేట్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఆర్బీఐ ఉద్యోగికి ఎన్నికల సంఘం (ECI) అధికారి పేరుతో ఒక నకిలీ ఎస్సెమ్మెస్ వచ్చింది. 48 గంటల్లో వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని అందులో ఉండటంతో బాధితుడు ఆందోళనకు గురయ్యారు. అనంతరం సైబర్ నేరగాళ్లు వాట్సప్ ద్వారా బాధితుడిని సంప్రదించి, వెరిఫికేషన్ ప్రక్రియ కోసం రూ.4 చెల్లించాలని ఒక లింక్ పంపారు.
బాధితుడు ఆ లింక్ ద్వారా ఏపికె (APK) ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయడంతో నేరగాళ్లు అతడి ఫోన్‌ను నియంత్రణలోకి తీసుకున్నారు. వీడియో కాల్‌లో మాట్లాడిన నిందితులు, చెల్లింపు విఫలమైందని నమ్మించి మరో రూ.5 పంపాలని కోరారు. ఈ క్రమంలోనే బాధితుడి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతా నుంచి రూ.3.25 లక్షలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతా నుంచి రూ.2 వేలు కట్ అయ్యాయి.
తన ఖాతాల నుంచి డబ్బులు మాయమైనట్లు గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలియని లింకులు, ఏపికె ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.








