రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనపై దృష్టి సారించింది. 2027-28 బడ్జెట్ ప్రక్రియను అక్టోబర్ 12 నుంచి అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ధరల పెరుగుదల వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే, దేశీయ వృద్ధిని కాపాడటం, ఉద్యోగ కల్పన మరియు అంతర్గత డిమాండ్‌ను పెంచడంపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
ఈ ప్రక్రియలో భాగంగా వ్యయ శాఖ కార్యదర్శి నేతృత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలతో ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ చర్చలు నవంబర్ మధ్య వరకు కొనసాగుతాయి. ఆయా శాఖలు తమ ఆర్థిక అవసరాలను అక్టోబర్ 6, 2026 నాటికే యూనియన్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (UBIS)లో నమోదు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
డిసెంబర్ చివరి నాటికి తుది వ్యయ పరిమితులను ఖరారు చేస్తారు. పన్నుల ద్వారా వచ్చే రాబడి అంచనాలను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ నివేదికను సిద్ధం చేస్తారు. మోడీ 3.0 ప్రభుత్వంలో ఇది నాలుగో బడ్జెట్ కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెడుతున్న 10వ బడ్జెట్ కావడం గమనార్హం. భారత రాజకీయ చరిత్రలో ఒక ఆర్థిక మంత్రి వరుసగా 10 బడ్జెట్లను సమర్పించడం ఇదే మొదటిసారి.
ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే దిశగా సంస్కరణలను మరింత వేగంగా అమలు చేసే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సంకేతాలు ఇచ్చింది.








