జనన, మరణాల నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1, 2026 నుంచి అమలు కానున్నాయి. ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించిందని గణాంకాల శాఖ కార్యదర్శి రవికుమార్ సుర్పూర్ వెల్లడించారు. సకాలంలో నమోదు చేయని వారికి ఇకపై చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం, జననం లేదా మరణం జరిగిన ఏడాది తర్వాత, రెండేళ్ల లోపు నమోదు చేసుకునే కేసుల్లో విచారణ కఠినంగా ఉంటుంది. ఇటువంటి దరఖాస్తులను మేజిస్ట్రేట్ (ప్రభుత్వ న్యాయాధికారి) స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సమర్పించిన పత్రాల నిజనిర్ధారణ, సంఘటన ప్రామాణికతను తనిఖీ చేసిన తర్వాతే, నిర్ణీత రుసుము చెల్లించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ జనన లేదా మరణం జరిగి రెండేళ్లు దాటితే, నమోదు ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఇటువంటి ఆలస్యమైన కేసుల్లో ఫస్ట్ క్లాస్ జుడీషియల్ మేజిస్ట్రేట్ (ప్రథమ శ్రేణి న్యాయాధికారి) ఇచ్చే కోర్టు ఆదేశాలు ఉంటేనే నమోదుకు అనుమతి లభిస్తుంది. అక్టోబర్ 1 నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
నమోదు ప్రక్రియలో నకిలీ పత్రాలను అరికట్టడం, డేటాలో పారదర్శకతను పెంచడమే ఈ చట్ట సవరణ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. ప్రతి రికార్డు ఖచ్చితంగా ఉండేలా చూడటానికి ఈ బహుళ స్థాయి తనిఖీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.








