మహిళల టెన్నిస్‌లో ప్రముఖ క్రీడాకారిణి అయిన మార్కెట ఒండ్రుసోవాపై స్వతంత్ర ట్రబ్యునల్ నాలుగేళ్ల నిషేధం విధించింది. అథ్లెట్లు నిషేధిత డ్రగ్స్‌ను వాడుతున్నారా లేదా అని తేల్చడానికి నిర్వహించే డోప్ పరీక్షలకు ఆమె నిరాకరించినందుకు ఈ భారీ శిక్ష పడింది. ఉద్దేశపూర్వకంగానే పరీక్షకు అంగీకరించలేదని తేలడంతో టెన్నిస్ లోకం నుంచి ఆమెను సస్పెండ్ చేశారు.
గతేడాది డిసెంబర్‌లో డోపింగ్ నియంత్రణ అధికారి పరీక్షలు చేసేందుకు రాగా, ఒండ్రుసోవా ఆయనను తన ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో అంతర్జాతీయ టెన్నిస్ సమగ్రత ఏజన్సీ ఆమెపై కేసు నమోదు చేసింది. విచారణ సందర్భంగా తాను ఒత్తిడిలో ఉన్నానని, మానసిక ఆరోగ్యం సరిగా లేనందున పరీక్షకు సిద్ధపడలేకపోయానని ఆమె వివరణ ఇచ్చింది.
అయితే, ఆమె చెప్పిన కారణాలు సహేతుకమైనవి కావని ట్రబ్యునల్ తేల్చింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే పరీక్షకు దూరమైనందుకు 2030 జూన్ 31 వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. ఈ కోర్టు తీర్పును చెక్ రిపబ్లిక్ కు చెందిన ఈ క్రీడాకారిణి స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.







