మహారాష్ట్రలోని పుణె జిల్లా చారిత్రాత్మక లోహగఢ్ కోట సమీపంలో గురువారం ఉదయం జరిగిన ఒక ప్రమాదంలో యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మరణించాడు. తన కాబోయే భార్య పుట్టినరోజును పురస్కరించుకుని ఆమెతో కలిసి ఫొటోలు దిగుతుండగా, అకస్మాత్తుగా వీచిన గాలికి ఆయన 400 అడుగుల లోతున్న లోయలోకి జారిపడ్డారు. ఈ ఘటనలో కేతన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్, తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వచ్చే నవంబరు నెలలో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్న ఆయన, ఉదయ్‌పుర్ ప్యాలెస్‌ను కూడా బుక్ చేసుకున్నారు. ఇలా పెళ్లి పీటలెక్కడానికి ఇంకా నాలుగు నెలలు మాత్రమే ఉండగా, ఈ దుర్ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
దట్టమైన పొగమంచు మరియు అందమైన వాతావరణం నేపథ్యంలో ఫొటోలు తీయడానికి కేతన్ తన కాబోయే భార్యను ఇద్దరు స్నేహితులతో కలిసి లోహగఢ్ కోటకు తీసుకువెళ్లారు. అయితే ఫొటో షూట్ జరుగుతుండగా ఒక్కసారిగా వీచిన హోరుగాలికి ఆయన అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయారు. కళ్లముందే తమ ప్రియమైన వ్యక్తి అనంతలోకాలకు వెళ్లడంతో కాబోయే వధువు మరియు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.







