యాదాద్రి జిల్లాలోని AIIMS బీబీనగర్ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలను మరింత వేగంగా, క్రమబద్ధంగా అందించేందుకు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వచ్చే ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

సవరించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. శనివారం రోజున మాత్రం ఉదయం 8:00 గంటల నుంచి 10:30 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

కొన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలకు ప్రత్యేక OPD రోజులను కూడా ఆసుపత్రి వర్గాలు కేటాయించాయి. రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చే ముందు సంబంధిత విభాగం రిజిస్ట్రేషన్ సమయాలను, OPD రోజులను ఒకసారి సరిచూసుకోవాలని AIIMS బీబీనగర్ ప్రజాసంబంధాల విభాగం కోరింది.

ఈ కొత్త సమయాలను దృష్టిలో ఉంచుకుని రోగులు తమ వైద్య పరీక్షల కోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆసుపత్రి సూచించింది. ఆగస్టు 1 తర్వాత ఆసుపత్రికి వచ్చే వారు ఈ కొత్త షెడ్యూల్ ప్రకారమే సేవలను పొందాల్సి ఉంటుంది.