భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆగస్టు 15ను భారత స్వాతంత్ర్య దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాయి. భారత 80వ స్వాతంత్ర్య వేడుకలకు ముందు వెలువడిన ఈ ప్రకటనను ప్రవాస భారతీయులు అరుదైన గౌరవంగా భావిస్తున్నారు.
న్యూయార్క్ గవర్నర్ కాథీ హోకుల్ ఆగస్టు 15, 2026ను ఇండియా ఇండిపెండెన్స్ డేగా ప్రకటించగా, న్యూజెర్సీలో గవర్నర్ మైకీ షెర్రిల్ ఇదే తరహా ప్రకటన చేశారు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ఎక్స్ (X) వేదికగా వెల్లడించింది. భారత్, అమెరికా దేశాలు పంచుకుంటున్న ప్రజాస్వామ్య విలువలను ఈ నిర్ణయాలు ప్రతిబింబిస్తున్నాయని కాన్సులేట్ పేర్కొంది.
అమెరికాలో అత్యధికంగా ఇండో-అమెరికన్లు నివసిస్తున్న రాష్ట్రాలు న్యూయార్క్, న్యూజెర్సీ. విద్య, టెక్నాలజీ, ఆరోగ్యం, వ్యాపారం మరియు ప్రజా సేవారంగాల్లో భారతీయ మూలాలున్న వారు అందిస్తున్న సేవలను ఈ ప్రకటనలు గుర్తించాయి. వలస పాలన నుంచి విముక్తి కోసం భారత్ చేసిన పోరాటాన్ని, ప్రజాస్వామ్యానికి ఆ దేశం ఇస్తున్న ప్రాధాన్యతను న్యూయార్క్ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఈ ప్రకటనలపై భారత కాన్సులేట్ స్పందిస్తూ, ఇరు దేశాల మధ్య స్నేహాన్ని, భారతీయ అమెరికన్ల కృషిని గుర్తించినందుకు గవర్నర్లకు కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటికే మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ, బోస్టన్ మేయర్ మిషెల్ వు కూడా ఆగస్టు 15ను ఇండియా డేగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో సుమారు 54 లక్షల మంది భారతీయ మూలాలున్న వారు నివసిస్తున్నారు.








