లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ‘ఆల్-ఇన్ సమిట్’ లైవ్ ఈవెంట్‌లో ఎన్‌విడియా (NVIDIA) సీఈఓ జెన్సన్ హువాంగ్ మాట్లాడుతుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఈ కాల్‌ను హువాంగ్ స్పీకర్ ఆన్ చేసి అక్కడ ఉన్న ఇన్వెస్టర్లు, టెక్ నిపుణులకు వినిపించారు. AI వల్ల మానవాళికి ముప్పు ఉందనే ఆందోళనలను, రోబోలు ప్రపంచాన్ని ఆక్రమిస్తాయనే వాదనలను ట్రంప్ ఈ సందర్భంగా బూటకపు ప్రచారంగా కొట్టిపారేశారు.
AI టెక్నాలజీని నియంత్రించకపోతే అది భస్మాసురహస్తంలా మారుతుందని, రానున్న 12 నెలల్లోపు AI ఇంటర్నెట్‌ను తన అధీనంలోకి తెచ్చుకునే ప్రమాదం ఉందని చాలామంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. AI వ్యవస్థలు తమంతట తామే సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నాయని, వీటిని నియంత్రించడం మానవులకు కష్టంగా మారవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. AI ఏజెంట్లు అంటే స్వయంగా నిర్ణయాలు తీసుకోగల AI సిస్టమ్స్, తమ పనికి సంబంధం లేని సైబర్ సెక్యూరిటీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని కూడా ఆరోపణలు వస్తున్నాయి.
అయితే, ఈ ఆందోళనల వెనుక అమెరికా వ్యతిరేక శక్తుల కుట్ర ఉందని ట్రంప్ మండిపడ్డారు. అమెరికాలో AI అభివృద్ధి వేగాన్ని ఆపితే అది చైనాకు లాభం చేకూరుస్తుందని, ఆ దేశం దీనివల్ల సంతోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. చైనాపై అమెరికా ఆధిపత్యం కొనసాగాలంటే AI తప్పనిసరి అని, రానున్న 25 ఏళ్లలో డేటా సెంటర్లు అతిపెద్ద వ్యాపారంగా మారుతాయని ట్రంప్ స్పష్టం చేశారు.
ఫిన్లాండ్‌లో డేటా సెంటర్లకు అనుమతులు లభించడం లేదని జరుగుతున్న ప్రచారం కూడా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా AIపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో, ట్రంప్ మాత్రం దీనిని చైనా కుట్రగా అభివర్ణించారు. చైనాకు లాభం చేకూర్చే ఏ ప్రయత్నాన్ని తాను అడ్డుకుంటానని ట్రంప్ తేల్చి చెప్పారు.







