Anthropic, OpenAI వంటి AI కంపెనీలు Claude, ChatGPT వంటి తమ ఉత్పత్తులను ప్రజలు ఏ విధంగా ఉపయోగిస్తున్నారో వివరిస్తూ క్రమం తప్పకుండా నివేదికలను విడుదల చేస్తుంటాయి. అయితే, ఈ కంపెనీలు తమకు నచ్చిన, తాము చూపించాలనుకున్న డేటాను మాత్రమే బయటపెడుతున్నాయని ఏఐ పరిశోధకులు ఆరోపిస్తున్నారు.
ఈ నివేదికల్లోని సమాచారాన్ని బయటి వ్యక్తులు లేదా స్వతంత్ర సంస్థలు సరిచూసుకునే అవకాశం లేదు. దీనివల్ల కంపెనీలు ఇచ్చే గణాంకాలు ఎంతవరకు నిజమో తెలుసుకోవడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్టాన్‌ఫోర్డ్ ట్రస్ట్‌వర్తీ ఏఐ రీసెర్చ్ (స్టెయిర్) ల్యాబ్‌లో కంప్యూటర్ సైన్స్ పరిశోధకులు ఈ అంశంపై స్పందించారు. “ఈ నివేదికల్లోని విషయాలను ధృవీకరించడానికి ఎటువంటి స్వతంత్ర మూలం లేదు” అని వారు స్పష్టం చేశారు.
కంపెనీలు తమ లాభం కోసం లేదా మార్కెటింగ్ కోసం డేటాను వడపోసి చూపిస్తున్నాయనేది పరిశోధకుల ప్రధాన వాదన. ఇలాంటి ఏకపక్ష సమాచారం వల్ల AI వినియోగంపై ప్రజలకు, పరిశోధకులకు సరైన అవగాహన ఉండదని వారు హెచ్చరిస్తున్నారు.








