అహ్మదాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఇంటీరియర్ డిజైన్ చదువుకుంటున్న విద్యార్థినిపై సెక్యూరిటీ గార్డు ధరమ్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాకు చెందిన ధరమ్ సింగ్, గత రెండు సంవత్సరాలుగా అహ్మదాబాద్‌లో నివసిస్తూ అదే అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

బాధితురాలు టెర్రస్‌పై ఫోన్ మాట్లాడుకుని కిందకు వస్తుండగా, నిందితుడు ఆమెను బలవంతంగా టెర్రస్‌పైకి లాక్కెళ్లాడు. అక్కడ ఆమె గొంతుకు వైర్ చుట్టి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు, టెర్రస్ తలుపు వేసి పారిపోయాడు. బాధితురాలి కేకలు విని అపార్ట్‌మెంట్ వాసులు వచ్చి తలుపు తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, రికవరీ పంచనామా ప్రక్రియ నిర్వహిస్తుండగా నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎస్. పర్మార్ సర్వీస్ రివాల్వర్‌ను లాక్కోవడానికి ధరమ్ సింగ్ ప్రయత్నించాడు.

నిందితుడిని అడ్డుకునే క్రమంలో మరో పోలీస్ అధికారి జరిపిన కాల్పుల్లో ధరమ్ సింగ్‌తో పాటు ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివం వర్మ మీడియాకు వెల్లడించారు.