ఆగస్ట్ 14, 2026న ఆగ్రాలోని యమునా నది వంతెనపై ఈ ఘటన జరిగింది. రింకు తన భార్య లక్ష్మి, 11 నెలల కుమార్తెతో కలిసి బైక్ మీద వెళ్తుండగా వంతెన వద్ద ఆగి సెల్ఫీలు తీసుకున్నారు. ఆ సమయంలో చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న రింకు, ఒక్కసారిగా పాపను నదిలోకి విసిరేశాడు.
పాపను విసిరిన వెంటనే తన భార్య లక్ష్మిని కూడా నదిలోకి తోసేయడానికి రింకు ప్రయత్నించాడు. ఆమెను గట్టిగా పట్టుకుని తోసేయడానికి ప్రయత్నిస్తుండగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి లక్ష్మిని కాపాడి, రింకును పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గజ ఈతగాళ్లు, పోలీసు బృందాలు 24 గంటలుగా గాలిస్తున్నా చిన్నారి ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం పోలీసులు రింకును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
బైక్ మీద వెళ్తున్నప్పుడు భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ వల్ల కోపంతోనే రింకు ఇలా చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన వెనుక ముందస్తు ప్రణాళిక ఏమీ లేదని పోలీసులు చెబుతున్నారు. పాప కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా, పూర్తి విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.







