హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యశ్ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకుల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీతో పని చేస్తే ప్రేక్షకులు ఎవరినైనా సపోర్ట్ చేస్తారని, సినిమాకు సరిహద్దులు ఉండవని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు అందరూ కలిసి పనిచేయాలని యశ్ పిలుపునిచ్చారు.
ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. నయనతార పాత్ర అద్భుతంగా ఉంటుందని, కియారా, రుక్మిణి, హుమా ఖురేషి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని యశ్ చెప్పారు. ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని ఆయన వివరించారు.
ఇంగ్లిష్, కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో విడుదల కానుంది. ‘కేజీఎఫ్’ చిత్రానికి సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు కూడా సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాను దిల్ రాజు విడుదల చేస్తున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఇండస్ట్రీకి తన వంతు సహకారం అందించే లక్ష్యంతో పనిచేస్తోందని యశ్ ప్రశంసించారు. తెలుగు ప్రేక్షకులు తనకు ఇచ్చిన బలానికి, మద్దతుకు రెండింతలు తిరిగి ఇస్తానని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన సినిమాలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి యశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.








