సినిమా రంగంలో నిలదొక్కుకోవాలని తపించే ఒక యువకుడి ప్రయాణమే ‘సంజీవ్’ చిత్రం. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ నేర్చుకున్న ఒక కుర్రాడు, సినిమాల్లో అవకాశం కోసం పడే కష్టాలే ఈ కథాంశం.

ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. “ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానో నాకు తెలుసు, ఒక మంచి రోల్ దొరికితే చాలు” అని ఆ యువకుడు ఆశపడటం, అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారినప్పుడు అతను పడే వేదనను ఇందులో చూపించారు. స్నేహితుల మద్దతు, కుటుంబ సభ్యుల ఒత్తిడి, సమాజం నుంచి ఎదురయ్యే హేళనల మధ్య ఆ యువకుడు ఎలా నెట్టుకొచ్చాడనేది ఈ సినిమా కథ.

“సక్సెస్ అనేది ఇన్స్టెంట్ గా రాదు, టైమ్ పడుతుంది, వెయిట్ చేయాలి” వంటి సంభాషణలు ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. అనిల్ నక్కా, భూపతి కేవై, జాన్ కే జోసెఫ్ వంటి వారు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. నటీనటుల నటన, సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయని చిత్రబృందం చెబుతోంది.

సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరి జీవితానికి ఈ చిత్రం అద్దం పడుతుందని చిత్రబృందం నమ్ముతోంది. ఆగస్టు 21న ఈ సినిమా నేరుగా ‘ఆహా’ ఓటీటీ వేదికపై అందుబాటులోకి రానుంది.