ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని నష్టాల పేరుతో కేంద్ర ప్రభుత్వం గతంలోనే మూసివేసింది. ప్రస్తుతం ఈ పరిశ్రమలోని యంత్రాలు తుప్పుపట్టి, భవనాలు కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం ఫ్యాక్టరీలోని యంత్రాలు, భవనాలను తొలగించి తుక్కు కింద అమ్మేందుకు టెండర్లు పిలవడంతో, వేసవి నుంచి డిస్‌మేండల్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ పరిణామాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రతినిధులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని కోరారు. మరోవైపు, మాజీ మంత్రి జోగు రామన్న సీసీఐ పునరుద్ధరణ కోసం ఆగస్టు 30ని డెడ్ లైన్‌గా ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.
కేంద్రం పీపీపీ (PPP) మోడ్‌లో ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని, అది సాధ్యం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 250 కోట్లు వెచ్చించి పరిశ్రమను పునరుద్ధరిస్తే వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని ఆ పార్టీ వాదిస్తోంది. ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ యోచిస్తోంది.
ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో, ఈ సమస్యను తెరపైకి తెచ్చి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యంగా చేసుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తూ, ఈ రాజకీయ పోరులో పైచేయి సాధించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది.






