ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం ₹2,278.14 కోట్ల అంచనా వ్యయాన్ని ఖరారు చేసినట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. మొత్తం 2,009.23 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది.

ఈ ఎయిర్‌ఫీల్డ్‌లో పౌర విమానయానంతో పాటు కార్గో రవాణా, ఎంఆర్ఓ (Maintenance, Repair, and Overhaul) సదుపాయాలను కల్పించనున్నారు. రక్షణ మరియు పౌర విమానయాన అవసరాలను ఒకే చోట తీర్చేలా దీనిని రూపొందిస్తున్నారు. దీనివల్ల ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా వేగవంతం కావడంతో పాటు, వాణిజ్య, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు సాకారమవుతోందని ఆయన తెలిపారు.

ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, మౌలిక వసతుల కల్పన పనులను 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.