కోతులు తమ గుంపులో ఏదైనా చనిపోతే మనుషుల్లాగే ఏడుస్తూ నిశ్శబ్దంగా ఉండిపోతాయి. ముఖ్యంగా తల్లి కోతులు తమ పిల్లలు చనిపోయినా ఆ విషయాన్ని అంగీకరించలేక, వాటి కళేబరాలను రోజుల తరబడి లేదా వారాల పాటు గుండెలకు హత్తుకుని తిరుగుతుంటాయి.

అడవుల్లో వందల సంఖ్యలో కోతులు ఉన్నప్పటికీ, అవి చనిపోయినప్పుడు కళేబరాలు బయటపడవు. కోతులకు తమ మరణం వారం రోజుల ముందే తెలుస్తుందని, ఆ సమయంలో అవి ఆహారం మానివేసి ఏకాంతంగా తపస్సులా గడుపుతాయని ఒక నమ్మకం ఉంది. ప్రాణాలు వదిలే సమయానికి అవి చీమలు లేదా చెదపురుగుల పుట్టల వద్దకు వెళ్లి, తమ మృతదేహాలను వాటికి ఆహారంగా సమర్పిస్తాయని చెబుతుంటారు.

ఈ ఆచారానికి పౌరాణిక నేపథ్యం ఉందని భక్తులు నమ్ముతారు. ఆంజనేయ స్వామి తన మరణం గురించి తనకు ముందే తెలియాలని, తన శరీరం ఎవరికీ కనిపించకుండా చెదపురుగులకు ఆహారమై మట్టిలో కలిసిపోవాలని వరం కోరారని పురాణాలు చెబుతున్నాయి. ఆ వరం వల్లే ఆంజనేయ స్వరూపంగా భావించే వానరులు నేటికీ ఈ నియమాన్ని పాటిస్తున్నారని భక్తుల విశ్వాసం.

అయితే, వన్యప్రాణి నిపుణులు మాత్రం దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ప్రకృతిలో ఒక సహజ పారిశుధ్య వ్యవస్థ ఉందని, అడవిలో ఏ జంతువు చనిపోయినా నక్కలు, చిరుతలు, ఎలుగుబంట్లు, గద్దలు వెంటనే వాటిని ఆహారంగా మార్చుకుంటాయని వారు వివరిస్తున్నారు.

మిగిలిన శరీర భాగాలను పురుగులు, ఈగలు, బ్యాక్టీరియాలు కుళ్ళింపజేసి మట్టిలో కలిపేస్తాయి. చివరగా మిగిలే ఎముకలను ముళ్ల పందులు తమ శరీరానికి అవసరమైన కాల్షియం కోసం కొరికి తినేస్తాయి. ఈ చైన్ సిస్టమ్ లేదా ఆహార గొలుసు విధానం కారణంగానే అడవిలో ఏ జంతువు కళేబరమైనా ఎక్కువ కాలం ఉండదని నిపుణులు చెబుతున్నారు.