ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. శుక్రవారం జులై 17న తెనాలి నియోజకవర్గం చెంచుపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అభ్యర్థులను బరిలోకి దింపుతామని తెలిపారు. ఎన్డీఏ కూటమి విజయం కోసం జనసేన సిద్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలను, ప్రస్తుత స్థానిక ఎన్నికలతో ముడిపెట్టడం సరికాదని నాదెండ్ల మనోహర్ అన్నారు. అప్పట్లో కూటమి గెలుపు కోసం పార్టీ నాలుగు అడుగులు వెనక్కి తగ్గి త్యాగాలు చేసిందని, అయితే అదే ఫార్ములాను స్థానిక ఎన్నికలకు వర్తింపజేయడం పొరపాటని ఆయన స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, జన సైనికులు, వీరమహిళల ఆకాంక్షలను పార్టీ నాయకత్వం గుర్తించిందని ఆయన చెప్పారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ, కార్యకర్తలకు తగిన అవకాశాలు కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కూటమి భాగస్వామ్య పక్షాలతో సమన్వయం కొనసాగిస్తూనే, స్థానిక ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.








