తెలంగాణలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికల హడావిడి లేనప్పటికీ, బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్‌రావు రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు సాగిస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ కోసం నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై అవగాహన సదస్సుల పేరుతో ఈ నేతలు జిల్లాలను చుట్టుతున్నారు. ఒకరోజు హైదరాబాదులో సమావేశం, మరో రోజు జిల్లాలో మీటింగ్ నిర్వహిస్తూ వారు క్షేత్ర స్థాయిలో పాదచారిలా తిరుగుతున్నారు.

సాధారణంగా పెద్ద నాయకులు క్షేత్ర స్థాయికి వెళ్లడానికి ప్రత్యేక కారణాలు సృష్టించుకుంటారు కానీ, ప్రస్తుతం గులాబీ లీడర్స్ అధికారిక ప్రక్రియనే వాడుకుంటున్నారు. ఎస్‌ఐఆర్ అవగాహన సదస్సుల వేదికగా పార్టీ సభ్యత్వ నమోదు గురించి కార్యకర్తలకు కీలక సూచనలు అందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో బీఎల్‌ఏలను (బూత్ లెవల్ ఏజెంట్లు) ఏర్పాటు చేసి, వారితో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు.

ఇద్దరు అగ్రనేతలు జిల్లాలకు వెళ్లినప్పుడు ఉదయం ఒక నియోజకవర్గం, మధ్యాహ్నం మరొక నియోజకవర్గంలో మీటింగ్లు పెడుతూ కేడర్‌ను ఉత్తేజపరుస్తున్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు మరియు ఇతర రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఈ నియోజకవర్గ సమన్వయ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేవలం ప్రసంగించి వెళ్లిపోకుండా, కార్యకర్తలతో మమేకమై ఫోటోలు దిగుతూ ఒక్కొక్క మీటింగ్‌లో నాలుగు గంటల వరకు గడుపుతుండటం కింది స్థాయిలో సంతృప్తిని కలిగిస్తోంది.

నియోజకవర్గ సమస్యలపై చర్చిస్తూనే, రాష్ట్ర రాజకీయ పరిణామాల గురించి కూడా మాట్లాడటంతో ఈ సదస్సులకు కేడర్‌లో క్రేజ్ పెరుగుతోంది. ఎన్నికలకు ఇక రెండున్నరేళ్ల సమయం మాత్రమే ఉండటంతో, క్షేత్ర స్థాయిలో పూర్తి పటిష్టతపై గులాబీ అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఈ సమన్వయ సమావేశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఏ నియోజకవర్గంలో ఎలా మాట్లాడాలో సూచనలు ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే సగానికి పైగా నియోజకవర్గ సమన్వయ సమావేశాలు పూర్తికాగా, వీటికి వస్తున్న స్పందనతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. బయటకు రాకపోయినా, కేసీఆర్ అంతర్గతంగా అందిస్తున్న మార్గదర్శకత్వం పార్టీకి ఉపయోగపడుతోందని కారు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పేరుకు ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమాలు అయినా, ఇవి పార్టీ బలోపేతానికి బాగా ఉపయోగపడుతున్నాయని బీఆర్‌ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.