పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి పదవి నుంచి రెబెల్ ఎమ్మెల్యేల వర్గం తొలగించింది. 1998లో పార్టీని స్థాపించి మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో పాలన సాగించిన ఆమెకు ఇది పెద్ద షాక్‌గా మారింది. ఈ నిర్ణయంతో పార్టీపై ఆమె పట్టు కోల్పోయినట్లు సమాచారం.
రిటాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని తమ నాయకురాలిగా అంగీకరించలేదు. వీరు హౌరా సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను టీఎంసీ కొత్త నాయకుడిగా ఎన్నుకున్నారు. తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ఈ వర్గం స్పష్టం చేసింది.
స్థానిక న్యూ టౌన్‌లోని ఓ హోటల్‌లో పార్టీ కౌన్సిలర్లతో సమావేశమైన రిటాబ్రతా బెనర్జీ కీలక ప్రకటనలు చేశారు. గత ఐదేళ్లుగా పార్టీలో సంస్థాగత మార్పులు చోటు చేసుకోలేదని, దీంతో రాజ్యాంగబద్ధంగా కొత్త జాతీయ నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు.
అయితే, మమతా బెనర్జీ సన్నిహితుల్లో కొందరు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కామెడీ షోగా అభివర్ణిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, ఎమ్మెల్యేల ఫిరాయింపుల తర్వాత ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవి కోల్పోవడం వరస షాక్‌లుగా మమతా బెనర్జీని కలచివేశాయి. పలువురు సన్నిహితులు కూడా ఆమెకు దూరమయ్యారు.








