బ్లూక్రాఫ్ట్ ఆగ్రో పరిశ్రమ నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాలు సదాశివపేట పట్టణం మరియు ఆస్థానిక గ్రామాలకు కాలుష్య భూతంగా మారింది. ప్రజలు ముక్కు, నోరు మూసుకొని ప్రయాణిస్తున్నారు. సాయంత్రం వాసన భరించలేక పోతున్నారు. చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు, చిన్నపిల్లల ఎదుగుదల ప్రశ్నలు పెరుగుతున్నాయి.
చెరువులు, వాగులు కలుషితమై చేపలు మృతి చెందుతున్నాయి. పరిశ్రమ దిగువ భాగంలో పైప్‌లైన్‌లు పగిలిపోవడంతో రసాయన వ్యర్థాలు భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. రైతులు పంటలు ఎర్రబారుతున్నాయని, నీరు పంట చేనులోకి చేరడంతో పంటలు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 35కు పైగా గొర్రెలు, 20 వరకు బర్రెలు కలుషిత నీటిని తాగి మృతి చెందాయి.
కాలుష్య నియంత్రణ మండల (పీసీబీ) అధికారులు శాంపిల్స్ సేకరించి విచారణ ముగించి, ఏ చర్య తీసుకోకుండా వదిలిపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు కంపెనీ ఎదుట ధర్నాలు చేశారు. ఇప్పటి వరకు ఏ కఠిన చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు.
నందికంది గ్రామస్తుడు రఘువీరారెడ్డి "మా గ్రామాన్ని, మా జీవితాలను ప్రభుత్వం కాపాడాలి" అని అన్నాడు. నిర్మల అనే గ్రామస్తురాలు "గాలి, నీరు కలుషితమై దవాఖానల పాలవుతున్నాం. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు" అని అన్నారు. పరిశ్రమ నుంచి వచ్చే బూడిద ఇండ్ల పైన, వాకిల్లు పడుతోంది.
సంగారెడ్డి జిల్లాలోని ఈ పరిస్థితి హైదరాబాద్ సమీప ప్రాంతాల్లోని పరిశ్రమల పర్యావరణ నియంత్రణ పరిస్థితిని ప్రశ్నిస్తోంది. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని అధికారులు నామమాత్రంగా పరిశీలిస్తూ, చర్యలు తీసుకోకపోవడం ప్రజల ఆందోళనకు దారితీస్తోంది.








