మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మాజీ జీడీపీ ఛైర్‌పర్సన్ బిందుతో కలిసి సత్యవతి రాధోడ్ విలేకరులతో మాట్లాడారు. పన్నెండేండ్ల పాలనలో బీజేపీ గిరిజనుల అభివృద్ధికి ఏమీ చేయలేకపోయిందని, పుష్కర కాలంలో లంబాడా, ఆదివాసీలకు శూన్యం చేసిందని ఆరోపించారు.
1956 తర్వాత రెండు దశాబ్దాలు కాంగ్రెస్ గిరిజన రిజర్వేషన్‌ను నిర్లక్ష్యం చేసిందని, 1976లో జాయింట్ కమిటీ ద్వారా రిజర్వేషన్లు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. 2022లో సుప్రీంకోర్టు తీర్పు కారణంగా జీవో నంబర్ 272 రద్దయ్యిందని, దీంతో గిరిజనులకు ఉద్యోగాలు, విద్యావకాశాలు, పదోన్నతులు నష్టమయ్యాయని వివరించారు.
స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారని, సేవాలాల్ మహారాజ్ జయంతికి గుర్తింపు ఇచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రూ. 50 కోట్లతో లంబాడా, ఆదివాసీ భవనాలు నిర్మించి దేశవ్యాప్తంగా గిరిజన ఖ్యాతిని పెంచారని ప్రశంసించారు.
కల్లబొల్లి కబుర్లు, మాయ మాటలతో గిరిజనులను మోసం చేయడం ఆపాలని హెచ్చరించారు. మహబూబాబాద్ నుంచి ఎన్నికైన ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు రాంచంద్రునాయక్, మురళీ నాయక్ గిరిజన సమస్యలను పట్టించుకోకుండా తిరుగుతున్నారని, ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
గిరిజనుల సంక్షేమానికి కేంద్రం, రాష్ట్రం రెండూ కృషి చేయాలని, కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.








