ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఈజిప్ట్ జట్టు 78వ నిమిషం వరకు 2-0తో ముందంజలో ఉండి, చివరికి 3-2తో ఓటమి పాలైంది. అర్జెంటీనా జట్టు చివరి నిమిషాల్లో కమ్‌బ్యాక్ ఇచ్చి విజయం సాధించగా, ఈ ఫలితంపై ఈజిప్ట్ కోచ్ హొస్సామ్ హసన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఘాటుగా స్పందించారు.
రెఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్, VAR బృందం కలిసి కావాలనే అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు ఇచ్చారని కోచ్ ఆరోపించారు. ముఖ్యంగా ఈజిప్ట్ 1-0తో ముందంజలో ఉన్నప్పుడు, మిడ్‌ఫీల్డర్ మోస్తఫా జికో కొట్టిన గోల్‌ను రద్దు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. గోల్‌కు 10 సెకన్ల ముందు, 100 గజాల దూరంలో అర్జెంటీనా ప్లేయర్ లిసాండ్రో మార్టినెజ్‌పై ఈజిప్ట్ ఆటగాడు మర్వాన్ అత్తియా చేసిన చిన్న ఫౌల్‌ను సాకుగా చూపి ఆ గోల్‌ను రద్దు చేశారు.
మరోవైపు, మ్యాచ్ చివరి దశలో అర్జెంటీనా పెనాల్టీ బాక్స్‌లో జూలియన్ అల్వారెజ్, ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ మొహమ్మద్ సలాహ్‌ను షర్ట్ పట్టి లాగి, కాలు తొక్కి కింద పడేశాడు. ఈజిప్ట్ ఆటగాళ్లు పెనాల్టీ కోసం డిమాండ్ చేసినా, రెఫరీ ఆటను కొనసాగించమని సూచించారు. సలాహ్‌పై జరిగిన ఈ క్లియర్ ఫౌల్‌ను VAR బృందం కూడా పట్టించుకోకపోవడంతో ఈజిప్ట్ అభిమానులు, ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఈ పరిణామాల మధ్య ఇంజూరీ టైమ్‌లో అర్జెంటీనా ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ విన్నింగ్ గోల్ కొట్టి ఈజిప్ట్ ఆశలపై నీళ్లు చల్లారు. అర్జెంటీనా క్వార్టర్స్‌కు చేరుకున్నప్పటికీ, ఈ మ్యాచ్ లొల్లి వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద మ్యాచ్‌గా నిలిచిపోయింది. కోచ్ హొస్సామ్ హసన్ మాట్లాడుతూ, "ఇది ఫుట్‌బాలా.. ఫిక్సింగా?.. అర్జెంటీనాకే వరల్డ్ కప్ ఇచ్చేయండి" అని వ్యాఖ్యానించారు.








