నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వరుస చోరీలు చేసి తప్పించుకున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆర్మూర్, మాక్లూర్, దుబ్బ ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడిన ఈ ముఠా సభ్యులు చివరకు మహారాష్ట్రలోని హైమద్ నగర్ జిల్లా ఒట్టురు పోలీస్ స్టేషన్ పరిధిలో చిక్కారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసీపీ ప్రకాష్ యాదవ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు శనివారం నుంచి తెలంగాణ, మహారాష్ట్రల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే స్థానిక పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న దుండగులు మహారాష్ట్రలో దొంగిలించిన టాటా సుమోను వదిలేసి, మరో బొలెరో వాహనాన్ని ఎత్తుకుని పరారయ్యారు. ఆదివారం రాత్రి అక్కడి ఓ గోల్డ్ షాప్‌లో దోపిడీకి పాల్పడి, మరో ఇంట్లో చోరీకి యత్నించగా అప్రమత్తమైన మహారాష్ట్ర పోలీసులు వారిని పట్టుకున్నారు.

నిందితులపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ పోలీసులు రెండు రోజులు రాత్రింబవళ్లు గాలించినా ముఠా ఆచూకీ కనుగొనలేకపోయారు. ప్రస్తుతం నిందితులు మహారాష్ట్ర జైలులో ఉండడంతో, నిజామాబాద్‌లో జరిగిన చోరీల సొత్తు రికవరీలో ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు.

మహారాష్ట్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేసి నిందితులను నిజామాబాద్ పోలీసుల అదుపులోకి తీసుకువచ్చిన తర్వాతే విచారించి, చోరీ సొత్తును రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు.